కరీంనగర్ జ్యుయెలరీ షాపు చోరీ... దొంగల ఆచూకీ చెబితే రూ.1 లక్ష

  • కరీంనగర్‌ పీఎంజే జ్యువెలర్స్‌లో సాయుధ దోపిడీ
  • సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు ఎత్తుకెళ్లిన దుండగులు
  • ఐదుగురు నిందితుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు
  • దోపిడీ దొంగల ఆచూకీ తెలిపితే రూ.లక్ష బహుమతి
  • సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ
కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేయడంతో పాటు, వారి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష నగదు బహుమతిని ప్రకటించారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.

నిన్న ఉదయం కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో ఉన్న పీఎంజే జ్యువెలర్స్‌లోకి వినియోగదారుల రూపంలో ప్రవేశించిన ఐదుగురు సాయుధ దుండగులు, ఒక్కసారిగా సిబ్బందిపై తుపాకులతో కాల్పులకు తెగబడటంతో నలుగురు సిబ్బందికి గాయాలైన విషయం తెలిసిందే. అనంతరం దుండగులు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దోపిడీని తీవ్రంగా పరిగణించిన పోలీసులు, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు కట్టుదిట్టం చేశారు.

"ఈ ఫోటోలలో ఉన్న వ్యక్తులు కరీంనగర్‌ నగల దుకాణంలో జరిగిన దోపిడీలో పాల్గొన్నారని, వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సరైన సమాచారం అందించిన వారికి రూ.1 లక్ష బహుమతి ఇవ్వబడుతుంది" అని పోలీసులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కరపత్రాలను విడుదల చేశారు.

నిందితులకు సంబంధించి ఏవైనా ఆధారాలు లభిస్తే కరీంనగర్ టూ టౌన్ ఎస్‌హెచ్‌ఓ (8712670762), ఏసీపీ (8712670711), లేదా ఎస్‌బీ కంట్రోల్ రూం (8712670713) నంబర్లకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
 

PMJ Jewellers
Karimnagar
Jewellery shop robbery
Robbery case
Telangana police
Crime news
Gold ornaments
Cash reward
Police investigation
Jyothi Nagar

More Telugu News